విద్రోహ డ్రోన్లపై సంధించిన విల్లు
దేశీయ యాంటీడ్రోన్ వ్యవస్థ సిద్ధం
గన్నవరపు సుబ్బారావు, కె.సురేష్
ఈనాడు - హైదరాబాద్
తుమ్మెదల్లా రొద చేసుకుంటూ ఆకాశమార్గాన అకస్మికంగా వచ్చి పడుతున్న డ్రోన్లు నేడు భారత్‌కు భద్రతాపరమైన చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. ఈ లోహపు పక్షులు దేశ సరిహద్దుల్లో రక్షణ సిబ్బందికి సవాళ్లు రువ్వుతున్నాయి. వీటి ద్వారా ఆయుధాలు చేరవేసి మనదేశంలో విధ్వంసం సృష్టించాలని పాకిస్థాన్ కుట్రలు పన్నుతోంది. ఏటా 100-150 సార్లు విద్రోహ డ్రోన్లు భారత్‌లోకి చొరబడుతున్నట్లు అంచనా. జమ్మూలోని వైమానిక దళ స్థావరంలో గత నెల 27న జరిగిన డ్రోన్ దాడి, ఈ నెల 14న సరిహద్దుల్లో ఒక క్వాడ్ కాప్టర్ చొరబాటు యత్నం ఈ కోవలోనివే. ఈ సవాళ్లను ఎలా ఎదుర్కొనాలనేది.. ఇప్పుడు మనముందున్న ప్రధాన సమస్య. దీనికి పరిష్కారంగా యాంటీ డ్రోన్ సాంకేతికతపై మనదేశం దృష్టి సారించింది. అధునాతనమైన ఈ పరిజ్ఞానంపై పట్టు సాధించేందుకు శాస్త్రవేత్తలు, ప్రభుత్వ- ప్రైవేటు రంగ సంస్థలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన జెన్ టెక్నాలజీస్ ఈ విషయంలో ఒక అడుగు ముందుకు వేసి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో జెన్ యాంటీ డ్రోన్ సిస్టమ్ (జడ్‌ఏడీఎస్)ను సిద్ధం చేసింది. విదేశీ కంపెనీలకు దీటుగా ఇది తయారైంది. దీన్ని వాహనంలో ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ఈ పరిజ్ఞానానికి జెన్ టెక్నాలజీస్ మూడు పేటెంట్లనూ సంపాదించింది. మరో పది పేటెంట్ల కోసం దరఖాస్తు చేసుకుంది.
కనిపెట్టి..
రక్షిత ప్రదేశంలోకి చొరబడటానికి ముందే విద్రోహ డ్రోన్‌ను గుర్తించి, నిర్వీర్యం చేయడం ముఖ్యం. ఇందుకోసం జడ్‌ఏడీఎస్‌లో బహుళ అంచెలు, సెన్సర్లు ఉన్నాయి.
రేడియో ఫ్రీక్వెన్సీ ఆధారిత డ్రోన్ డిటెక్టర్
(ఆర్‌ఎఫ్‌డీడీ)
గ్రౌండ్ కంట్రోల్ సెంటర్ (జీసీసీ) నుంచి రేడియో తరంగ సందేశాలు పంపడం ద్వారా ముష్కరులు డ్రోన్‌ను నియంత్రిస్తారు. అలాగే అందులోని కెమెరా నుంచి వీడియో దృశ్యాలూ వారికి వెళతాయి. ఇలా వెళ్లే రేడియో కమ్యూనికేషన్‌ను జడ్‌ఏడీఎస్‌లోని ఆర్‌ఎఫ్‌డీడీ పట్టుకుంటుంది. దాని ఆధారంగా డ్రోన్‌ను పసిగడుతుంది. కమ్యూనికేషన్ ఏ ఫ్రీక్వెన్సీలో సాగినా ఇది గుర్తించగలదు.
పరిధి: 100 మీటర్లు - 10 కిలోమీటర్లు
వీడియో బేస్డ్ డ్రోన్ ఐడెంటిఫికేషన్ అండ్ ట్రాకింగ్
(వీడీఐటీ)
ఇది ఒక కెమెరా వంటిదే. రాత్రి, పగలు పనిచేయగలదు. డ్రోన్ ఉన్న ప్రదేశానికి సంబంధించి ఆర్‌ఎఫ్‌డీడీ నుంచి అందిన సంకేతాల ఆధారంగా డ్రోన్‌ను వీడియో తీసి ఆ దృశ్యాలను సాఫ్ట్‌వేర్ మాడ్యూల్‌కు అందజేస‌్ర్తుంది. అందులోని వీడియో ప్రాసెసింగ్ అల్గోరిథమ్స్.. డ్రోన్ ఉనికిని నిర్ధారించి, దాని గమనాన్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తాయి.
పరిధి: 3- 6 కి.మీ
రిజల్యూషన్: 2 మెగాపిక్సెల్
రాడార్
ఆపరేటర్‌తో ఎలాంటి కమ్యూనికేషన్‌లో లేని, పూర్తిగా స్వతంత్రంగా వ్యవహరించే డ్రోన్లను ఆర్‌ఎఫ్‌డీడీ సాయంతో గుర్తించలేం. ఇలాంటి సందర్భాల్లో రాడార్ల సాయంతో వాటి గుట్టురట్టు చేయవచ్చు. ఇవి రేడియో తరంగాలను నలుదిక్కులకు వెదజల్లుతాయి. ఆకాశంలో ఒక వస్తువును తాకినప్పుడు పరావర్తనం చెందుతాయి. ఇలా తిరిగొచ్చే రేడియో సంకేతాలను విశ్లేషించి, డ్రోన్ ఉనికిని గుర్తించవచ్చు. రాత్రింబవళ్లు, ఎలాంటి వాతావరణంలోనైనా ఇది పనిచేస్తుంది. జడ్‌ఏడీఎస్‌లో ఎక్స్ బ్యాండ్ త్రీడీ రాడార్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అది శత్రు డ్రోన్లు ఉన్న ప్రదేశానికి సంబంధించిన రేఖాంశ, అక్షాంశ వివరాలను తెలియజేస్తుంది.
డ్రోన్లు చిన్నగా ఉండటం వల్ల రాడార్‌కు స్పష్టంగా చిక్కవు. దీన్ని అధిగమించడానికి ‘మైక్రో డాప్లర్’ సాంకేతికతను జడ్‌ఏడీఎస్‌లో ఉపయోగిస్తున్నారు. ఇది డ్రోన్‌లోని రెక్కల భ్రమణం ఆధారంగా దాన్ని గుర్తిస్తుంది.
తెరపై చూపిస్తుంది
డేటా ఫ్యూజన్ అండ్ కమాండ్ సెంటర్ (డీఎఫ్‌సీసీ): ఆర్‌ఎఫ్‌డీడీ, వీడీఐటీ, రాడార్‌ల నుంచి వచ్చే డేటాను ఈ కమాండ్ కేంద్రంతో అనుసంధానిస్తారు. ఇది ముప్పునకు సంబంధించిన సమగ్ర చిత్రాన్ని కంప్యూటర్ తెరపై అందిస్తుంది. డ్రోన్ గుర్తింపు, దాని వర్గీకరణకు సంబంధించిన అల్గోరిథమ్స్ ఇందులో ఉన్నాయి. సదరు ప్రాంతానికి సంబంధించిన మ్యాప్‌లనూ ఇందులో అనుసంధానించొచ్చు. ముప్పు జోన్‌ను వలయాలుగా వర్గీకరించి, వాటిలోకి డ్రోన్ ఎక్కడి వరకూ వచ్చిందన్నది తెరపై వీక్షించొచ్చు.
పనిపట్టి..
డ్రోన్‌ను గుర్తించాక దాన్ని నిర్వీర్యం చేసే పని మొదలవుతుంది. ఇందుకోసం సాఫ్ట్‌కిల్, హార్డ్‌కిల్ అనే రెండు విధానాలు ఉన్నాయి. సందర్భోచితంగా వాటిని వాడాల్సి ఉంటుంది.
సాఫ్ట్‌కిల్
ఈ విధానంలో డ్రోన్‌ను నాశనం చేయరు. కాకుంటే దాన్ని ముందడుగు వేయకుండా బంధనాలు ఏర్పరుస్తారు. ఇందుకోసం జడ్‌ఏడీఎస్‌లో పలు విధానాలు ఉన్నాయి.
డ్రోన్ ఆర్‌ఎఫ్ జామర్ (డీఆర్‌ఎఫ్‌జే)
ఆపరేటర్‌కు, డ్రోన్‌కు మధ్య ఉన్న కమ్యూనికేషన్ లంకెను ఇది అడ్డుకుంటుంది. ఆర్‌ఎఫ్‌డీడీ గుర్తించే అన్ని ఫ్రీక్వెన్సీలు, మొబైల్, జీఎన్‌ఎస్‌ఎస్ సంకేతాలను తనంతట తానుగా ఇది జామ్ చేస్తుంది. ఫలితంగా డ్రోన్‌కు ఆపరేటర్‌తో సంబంధాలు తెగిపోతాయి.
ఇలాంటి పరిస్థితుల్లో డ్రోన్‌కు మూడు మార్గాంతరాలు ఉంటాయి.
1. అక్కడికక్కడే నేలపై దిగడం.
2. బ్యాటరీ అయిపోయేవరకూ గాల్లోనే ఎగరడం.
3. తోక ముడుచుకొని.. ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి తిరిగి వెళ్లిపోవడం.
పరిధి: 4-8 కిలోమీటర్లు
హార్డ్ కిల్
ఇందులో డ్రోన్‌ను నాశనం చేస్తారు. జడ్‌ఏడీఎస్‌లో కైనెటిక్స్ ఆధారిత కూల్చివేత, నెట్ బేస్డ్ డ్రోన్ క్యాచర్ అనే రెండు రకాల హార్డ్‌కిల్‌కు అవకాశాలు ఉన్నాయి. కైనెటిక్ విధానంలో ప్రధానంగా యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ గన్ సాయంతో డ్రోన్‌ను కూల్చివేస్తారు. సెన్సర్లు అందించే సంకేతాలకు అనుగుణంగా ఆ ఆయుధం.. డ్రోన్ దిశగా ఆటోమేటిక్‌గా గురిపెట్టగలదు. ఆదేశాల మేరకు తూటాలను ప్రయోగిస్తుంది. ‘నెట్ బేస్డ్ విధానం’లో ప్రత్యేకంగా ఒక డ్రోన్‌ను ఉపయోగిస్తారు. అది వలను ప్రయోగించి ఒడుపుగా శత్రు డ్రోన్‌ను పట్టేస్తుంది.
జీపీఎస్ జామింగ్
విద్రోహ డ్రోన్ తన మార్గనిర్దేశం కోసం జీపీఎస్‌ను వాడుతుంటుంది. ఆ జీపీఎస్ సంకేతాలను జడ్‌ఏడీఎస్ వ్యవస్థ ఏమారుస్తుంది. ఈ విధానం ద్వారా లోహవిహంగాన్ని తన గమ్యస్థానానికి వెళ్లకుండా చేయవచ్చు. కొన్ని అధునాతన పద్ధతుల్లో స్పూఫింగ్ విధానం ద్వారా తాను వేరే చోట ఉన్నట్లుగా ఆ డ్రోన్‌ను భ్రమింపచేస్తుంది.
మూక దాడికి చెక్
పదుల సంఖ్యలో డ్రోన్లు సమూహాల్లా సంచరిస్తూ ముప్పేట దాడి చేసే ‘స్వార్మింగ్’ పరిజ్ఞానం అందుబాటులోకి వస్తోంది. అవి పరస్పరం కమ్యూనికేషన్ సాగిస్తూ సమన్వయంతో దాడులు చేస్తుంటాయి. జడ్‌ఏడీఎస్‌లోని అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పలు రకాల సెన్సర్లను కృత్రిమ మేధతో అనుసంధానించడం ద్వారా ఆ డ్రోన్ మూకకు ఏకపెట్టున కళ్లెం వేయవచ్చు.
ఎక్కడ వాడొచ్చు
*
*
*
*
*
*
*
చమురు, గ్యాస్ పరిశ్రమలు
డ్రోన్ల సాంకేతికతకు భారత్‌ను కేంద్రస్థానంగా మారుద్దాం
భవిష్యత్ అవసరాల దృష్ట్యా డ్రోన్ల రంగాన్ని భారీగా సరళీకరించాలి. దేశీయ సంస్థలను ప్రోత్సహించాలి. ‘ఆత్మనిర్భర్ భారత్’ కింద.. ఉపకరణాలను దిగుమతి చేసుకొని సొంత బ్రాండ్‌తో మార్కెట్ చేసే కంపెనీలకు బదులు స్వీయ పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) సత్తా ఉన్న దేశీయ కంపెనీలకు ఊతమివ్వడం మేలు. దీనివల్ల మనదేశం డ్రోన్, యాంటీ డ్రోన్ ఉపకరణాలకు అంతర్జాతీయ హబ్‌గా మారుతుంది. ఇక్కడ ఇజ్రాయెల్‌ను ఉదాహరణగా తీసుకోవాలి. విదేశీ ఆయుధంతో పోలిస్తే ఒక స్వదేశీ అయుధం సామర్థ్యం తక్కువగా ఉన్నప్పటికీ అక్కడి ప్రభుత్వం స్వదేశీ అస్త్రాన్నే కొనుగోలు చేస్తోంది. దీనివల్ల దేశీయ సత్తాకు ఊపిరిలూదినట్లు అవుతుందని, భవిష్యత్‌లో అధునాతన ఆయుధాల తయారీకి ఊతం లభిస్తుందన్నది ఆ దేశ సిద్ధాంతం. ఇది సత్ఫలితాలు ఇచ్చింది. నేడు అగ్రశ్రేణి ఆయుధ ఎగుమతిదారుల్లో ఒకటిగా ఆ దేశం ఎదిగింది. మనం కూడా అలా ఎందుకు కాకూడదు?
-అశోక్ అట్లూరి, సీఎండీ- జెన్ టెక్నాలజీస్
భవిష్యత్ యుద్ధాల్లో డ్రోన్లు, యాంటీ డ్రోన్లే కీలకం
భవిష్యత్ యుద్ధాల్లో డ్రోన్లు కీలకం. డ్రోన్లు, యాంటీడ్రోన్ల వ్యవస్థల్లో ఉన్న సమర్థత ఆ దేశ విజయావకాశాలను నిర్ధారిస్తుంది. అజర్‌బైజాన్ యుద్ధంతో అది తేటతెల్లమైంది. కాబట్టి మన దేశం కూడా డ్రోన్లు, యాంటీడ్రోన్ల పరిజ్ఞానాన్ని దేశీయంగా అభివృద్ధి చేసుకొని, సన్నద్ధంగా ఉండాలి. మొన్నటి జమ్మూ లాంటి ఉదంతాలు పునరావృతం కాకూడదనుకుంటే మన సాంకేతిక పరిజ్ఞానంతో శత్రు దేశాల వెన్నులో వణుకు పుట్టించాలి.
-డాక్టర్ నాగేంద్ర బాబు, వైస్ ప్రెసిడెంట్ జెన్ టెక్నాలజీస్, డైరెక్టర్ - యూనిస్ట్రింగ్స్
Tags :