ఈ హాస్టళ్లు... పాల వెల్లువకు!
మనుషుల హాస్టల్స్ గురించి తెలుసు.. మరి పశువుల హాస్టల్స్ గురించి ఎప్పుడైనా విన్నారా? పాడి పశువులని పెంచే సౌకర్యాలు, ఓపిక లేనివాళ్లెవరైనా ఈ వసతి గృహంలో వీటిని ఉంచొచ్చు. వాటి పోషణ బాధ్యతంతా మహిళలదే. ఇందుకోసం నెలకింతని రుసుము వసూలు చేస్తున్నారు సంగారెడ్డి జిల్లా మహిళలు.. పాడిని వృద్ధి చేసే ఈ వినూత్నమైన ఆలోచన భలే ఉంది కదూ...
పశువుల హాస్టల్ వినడానికి బాగుంది కదూ! చూడ్డానికీ బాగుంటుంది. దోమలు లేని సౌకర్యవంతమైన పశువుల కొట్టాలు... కాపరులు ఉండేందుకు వీలుగా గదులు, వారానికో సారి పశు వైద్యుల రాక. 160 వరకూ గేదెలు సౌకర్యవంతంగా ఉండేందుకు ఏర్పాటు చేసిన ఈ హాస్టల్ నిర్వహణ బాధ్యత అంతా మహిళలదే. ఇంతకీ ఈ హాస్టల్ ఎక్కడుందో చెప్పలేదు కదూ! సిద్దిపేట జిల్లా పొన్నాలలో ఉంది. చాలామందికి పాడిపశువులపైన ఆసక్తి ఉన్నా... వాటి పోషణ చేయలేక వెనకడుగు వేస్తారు. మరికొందరికి వాటిని కట్టేసే స్థలం లేక... రోడ్లపైనే వదిలేస్తుంటారు. ఇలా అర్ధరాత్రి పూట తిరిగే పశువులతో రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. ఈ సమస్యలకు పరిష్కారంగా పశువులకూ వసతి గృహం ఉండాలనే ఉద్దేశంతో రూ.రెండు కోట్లతో సిద్దిపేట జిల్లా పొన్నాలలో ఓ హాస్టల్‌ని నిర్మించారు. ఈ ఆలోచన వచ్చింది మొదలు వాటి నిర్వహణ బాధ్యత స్థానిక మహిళలకు అప్పగించాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఆసక్తి ఉన్న మహిళలు ముందుకు రావాలని కోరడంతో 30 మంది మహిళలు వచ్చారు. వీరిలో చాలా మందికి పశుపోషణలో అనుభవం ఉంది. వీరంతా యంత్రాలను ఉపయోగించి పాలు పితకడం, గడ్డిని ముక్కలుగా కత్తిరించడం... లాంటి ప్రాథమిక అంశాలపై బాలవికాస సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకున్నవారే.
రైతులు తమ పాడి పశువులను ఈ హాస్టల్‌లో అప్పగిస్తే చాలు. మిగతా పనులన్నీ హాస్టల్‌ని నిర్వహించే ఈ 30 మంది మహిళలే చూసుకుంటారు. రెండు షిఫ్టుల్లో వీళ్లు పనిచేస్తారు. పశువులకు గడ్డి వేయడం, పేడ తీయడం, వాటిని శుభ్రంగా కడగడం, పాలు పితకడం... ఇలా అన్ని బాధ్యతలు వీరివే. పశువుల పేడతో పిడకలను తయారు చేసి స్థానికంగా వాటిని విక్రయించనున్నారు. రానున్న రోజుల్లో చుట్టుపక్కల డైయిరీల పనితీరుని పర్యవేక్షించి కోవా, నెయ్యి తయారీ వంటి వాటిలో శిక్షణ తీసుకుని వీరి పేరిటే ఒక బ్రాండ్ ఏర్పాటు చేసుకుని అమ్మకాలు సాగించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే నిర్వహణ కోసం ఒక్కో గేదెకు యజమానులు కొంత మొత్తాన్ని ప్రతినెలా రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. గ్రామంలోని ప్రతి ఒక్కరికీ పాడి పశువులు ఉండేలా చూడటం, వాటన్నింటినీ వసతి గృహంలో ఉంచి అధిక పాల దిగుబడి సాధించడమే లక్ష్యంగా ఈ మహిళా బృందం పనిచేయనుంది.
‘పల్లెల్లో పశుపోషణ పనులన్నీ ఆడవాళ్లే చూసుకునేవారు. కానీ గత కొన్నేళ్లుగా ఎవరూ పాడి పశువులను పెంచడం లేదు. ఇది స్త్రీల ఆర్థిక స్థితిగతుల మీదా ప్రభావం చూపింది. ఇప్పుడు అందుబాటులోకి తెచ్చిన ఈ పశువుల వసతి గృహం తిరిగి మేం ఆర్థికంగా బలోపేతం కావడానికి మంచి అవకాశం’ అంటున్నారు హాస్టల్స్ నిర్వహణ సభ్యుల్లో ఒకరైన నిర్మల. వీరు హాస్టల్‌లో ఉండే పశువుల నిర్వహణ రూపంగా వచ్చే డబ్బుతో పాటూ, సొంత గేదెల నుంచి వచ్చిన పాల ద్వారానూ ఆదాయం పొందుతున్నారు. ప్రస్తుతం ఈ పాడి పశువుల సముదాయం (హాస్టల్)లో రోజూ 200 లీటర్ల మేర పాలు విజయ డెయిరీకి అందిస్తున్నారు. ఇక్కడే ఒక ప్లాంటునూ అందుబాటులోకి తెచ్చారు.
హాస్టల్‌లో ఉండే పశువుల నిర్వహణ రూపంగా వచ్చే డబ్బుతో పాటూ, సొంత బర్రెల నుంచి వచ్చిన పాల ద్వారానూ ఆదాయం పొందుతున్నారు. ప్రస్తుతం ఈ పాడి పశువుల సముదాయం (హాస్టల్)లో రోజూ 200లీటర్ల మేర పాలు విజయ డెయిరీకి అందిస్తున్నారు.
- రాజేందర్ సురకంటి, ఈనాడు, సిద్దిపేట
Tags :