comparemela.com


ఇంత ఊడిగమా..!
ఇంటర్వ్యూకు హాజరుకావాలంటూ తేజస్వినికి అధికారులు పంపిన కాల్‌లెటర్‌, బాధితురాలు తేజస్విని
అధికార పార్టీ నేతల సిఫార్సులకు తలొగ్గిన అధికారులు
అంగన్‌వాడీ టీచర్‌ పోస్టు భర్తీలో అర్హురాలికి అన్యాయం
కదిరి ఐసీడీఎస్‌ పరిధిలో అక్రమ బాగోతం
అనంతపురం: అధికార పార్టీ నేతలు ఏం చెబితే.. అందుకు అధికారులూ వంతపాడటం అనంతపురం జిల్లాలో పరిపాటిగా మారింది. దొందూదొందేగా వ్యవహరిస్తూ అర్హుల నోట్లో మట్టి కొడుతున్నారు. కొందరు అధికారులు, అధికార పార్టీ నేతలు ఎక్కడికక్కడ స్థానికంగా కుమ్మక్కై ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ పథకాల్లో అనర్హులకు పెద్దపీట వేస్తుండటమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ పరంపర ఉద్యోగాల ఎంపికలోనూ కొనసాగిస్తున్నారనడంలో సందేహం లేదు. తాజాగా... అంగన్‌వాడీ పోస్టుల భర్తీలోనూ అర్హులకు మొండిచేయి చూపి... అనర్హులకు ఉద్యోగాలు కట్టబెడుతున్నారు. ఇందుకు కదిరి నియోజకవర్గంలోని ఆమడగూరు ఐసీడీఎస్‌ పరిధిలో ఓ నిరుద్యోగి మహిళకు జరిగిన అన్యాయమే తార్కాణంగా నిలుస్తోంది. తనకు జరిగిన అన్యాయాన్ని రాష్ట్రస్థాయి ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి జిల్లాస్థాయి అధికారుల వరకు అందరి వద్ద ఆమె మొరపెట్టుకున్నా.. పట్టించుకునే నాథుడే కరువయ్యారంటే.. జిల్లాలో అధికార పార్టీ నేతల సిఫార్సులకు అధికారులు ఏ మేరకు జీ హుజూర్‌ అంటున్నారో అర్థం చేసుకోవచ్చు.
ఉద్యోగానికి ఎంపిక చేసి.. అంతలోనే మరొకరికి కట్టబెట్టి..
ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కదిరి పడమర పరిధిలోని ఆమడగూరు మండలం జేకేపల్లి మినీ అంగన్‌వాడీ టీచర్‌ (కార్యకర్త) పోస్టు భర్తీకి సంబంధించి దరఖాస్తులు ఆహ్వానిస్తూ గతేడాది డిసెంబరులో సంబంధిత అధికారులు ప్రకటనలు ఇచ్చారు. జేకేపల్లికి చెందిన తేజస్విని మినీ అంగన్‌వాడీ టీచర్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకుంది. ఆ మేరకు అధికారులు ఆమెను కదిరి ఆర్డీఓ కార్యాలయంలో డిసెంబరు 28న ఇంటర్వ్యూకు హాజరుకావాలని కాల్‌ లెటర్‌ పంపారు. దీంతో ఆమె అదేరోజు ఇంటర్వ్యూకు హాజరైంది. జేకేపల్లి మినీ అంగన్‌వాడీ టీచర్‌ పోస్టుకు తేజస్విని మాత్రమే దరఖాస్తు చేసుకుంది. దీంతో ఆమెను ఉద్యోగానికి ఎంపిక చేశారు. ఐదారు రోజుల్లో అపాయింట్‌మెంట్‌ లెటర్‌ పంపుతామనీ, ఆ తరువాత ఉద్యోగంలో చేరాలని అధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేసి, పంపారు.
తనకు ఉద్యోగం వచ్చిందని ఆమె ఆనందంతో ఇంటికెళ్లింది. వారం రోజులు గడిచినా అపాయింట్‌మెంట్‌ లెటర్‌ రాలేదు. దీంతో ఆమె తన కుటుంబికులతో కలిసి స్థానిక అంగన్‌వాడీ అధికారులను కలిశారు. స్థానికంగా పనిచేసే సంబంధిత అధికారుల్లో ఒకరు.. ఆ ఉద్యోగం వేరొకరికి ఇచ్చారని చావు కబురు చల్లగా చెప్పారు. దీంతో అవాక్కైన తేజస్విని, ఆమె కుటుంబసభ్యులు.. స్థానిక సీడీపీఓను కలిసి, నిలదీశారు. తమ చేతుల్లో ఏమీ లేదనీ, పైఅధికారులకు పంపించామని సెలవిచ్చారు. పైఅధికారుల ఆదేశాల మేరకు అదే గ్రామానికి చెందిన జయంతి అనే మహిళకు ఉద్యోగం ఇచ్చామని చెప్పుకొచ్చారు. ఇంటర్వ్యూకు హాజరైంది తానొక్కతినే కదా..? ఆమెకెలా ఉద్యోగమిచ్చారనీ, ఆమె ఇప్పటికే వలంటీర్‌గా పనిచేస్తోందని కన్నీ టి పర్యంతమైంది. ఇంటర్వ్యూకు జయంతి ఆలస్యంగా వచ్చిందని స్థానిక సీడీపీఓ, సూపర్‌వైజర్‌ కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. ఎంత బతిమాలి నా... సదరు అధికారుల నుంచి పొంతనలేని సమాధానాలు రావడంతో ఆమె నిట్టూర్పుతో వెనుదిరిగింది. అప్పటినుంచి ఇప్పటి వరకూ ఆరు నెలలుగా ఉద్యోగం కోసం తేజస్విని పోరాటం చేస్తూనే ఉంది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మొదలుకుని, జాయింట్‌ కలెక్టర్‌, ఐసీడీఎస్‌ పీడీ వరకూ అర్జీ రూపంలో విన్నవించుకున్నా... ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం.
అధికార పార్టీ నేతలు చక్రం తిప్పారిలా..
జేకేపల్లి అంగన్‌వాడీ కార్యకర్త ఉద్యోగానికి తేజస్వినిని ఎంపిక చేశారని సమాచారం అందగానే.. అధికార పార్టీ నేతలు రంగంలోకి దిగారు. తమ సిఫార్సులు లేకుండా వేరొకరికి ఉద్యోగం ఎలా ఇస్తారన్న ఉద్దేశంతో దానిని మరొకరికి కట్టబెట్టేందుకు పావులు కదిపారు. ఈ క్రమంలో అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తీసుకొచ్చారు. అంగన్‌వాడీ కార్యకర్త పోస్టుకు దరఖాస్తు చేసుకోకపోయినా... ఇంటర్వ్యూకు హాజరుకాకపోయినా... అధికార పార్టీ నేతల సిఫార్సులకే అధికారులు తలొగ్గారు. అడ్డదారిలో ఆ గ్రామంలో వలంటీర్‌గా పనిచేస్తున్న జయంతికి ఉద్యోగం కట్టబెట్టారు. ఇందుకోసం అధికారులు అడ్డదారులు తొక్కిన విధానం చూస్తే ఎవరికైనా విస్మయం కలగకమానదు. అధికార పార్టీ నేతల సిఫార్సులతో వలంటీర్‌ నుంచి ఇంటర్వ్యూకు హాజరుకాకపోవడానికి కారణాలతో కూడిన వినతి పత్రాన్ని తీసుకుంటున్నట్లు ఫొటో తీసుకొని స్థానిక ఐసీడీఎస్‌ అధికారులు.. ఉన్నతాధికారులకు పంపి, తమ తప్పును కప్పిపుచ్చుకునే ప్ర యత్నం చేశారు.
స్థానికుల సమాచారం మేరకు.. ఆ ఇంటర్వ్యూ జరిగిన రోజు ఆ వలంటీర్‌ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరిలో అంగన్‌వాడీ కార్యకర్తగా పనిచేస్తూనే... మరోవైపు వలంటీర్‌గా ఫిబ్రవరిలో ఆమె పింఛన్లు పంపిణీ చేశారు. దీనిని బట్టి చూస్తే... రెండు ఉద్యోగాలూ చేస్తున్నట్లే కదా..! అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు అధికారులు ఏ మేరకు తలొగ్గుతున్నారో దీనిని బట్టే స్పష్టంగా అర్థమవుతోంది. బాధితురాలు తేజస్విని ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ... తనకు జరిగిన అన్యాయంపై విచారణ చేసి, న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన్‌ను వేడుకుంటోంది. మరి కలెక్టర్‌ ఏ మేరకు స్పందిస్తారో వేచిచూడాల్సిందే.
వలంటీర్‌ జయంతికి పంపిన అపాయింట్‌మెంట్‌ లెటర్‌
వలంటీర్‌గా జయంతి తన ఐడీ నెంబరుతో గ్రామంలో పింఛను పంపిణీ చేసిన నివేదిక

Related Keywords

,Posco ,Anantapur District ,Mini Post ,Office December ,Her ,Education Minister ,February Her ,பொஸ்கோ ,ஆனந்தபுர் மாவட்டம் ,மினி போஸ்ட் ,அலுவலகம் டிசம்பர் ,அவள் ,கல்வி அமைச்சர் ,

© 2024 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.